రామగుండం 3 ఏరియా ఓసి -1 గనికి జాతీయ స్థాయిలో గుర్తింపు

* కేంద్రమంత్రి చేతుల మీదుగా ఫైవ్ స్టార్ అవార్డు అందుకున్న రామగుండం-3 ఏరియా జీఎం సుంకర మధుసూదన్
🖨️ Print

పయనించే సూర్యుడు న్యూస్ : పెద్దపల్లి,రామగిరి, సెంటినరీ కాలనీ నవంబర్ 2: సింగరేణి సంస్థలోని రామగుండం-3 ఏరియా మరో ఘనత సాధించింది. ఈ ఏరియాకు చెందిన ఆర్‌జీఓసీ-1 ( ఓసి -1) గని 2024-25 ఆర్థిక సంవత్సరానికి జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక ఫైవ్ స్టార్ రేటింగ్ అవార్డును దక్కించుకుంది.ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం రాయ్‌పూర్‌లో సోమవారం నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ సహాయ మంత్రి సతీష్ చంద్ర దూబే చేతుల మీదుగా రామగుండం-3 ఏరియా జనరల్ మేనేజర్ సుంకర మధుసూదన్ అవార్డును అందుకున్నారు.ఉత్తమ మైనింగ్ పద్ధతుల అమలు, పర్యావరణ పరిరక్షణ, కార్మికుల సంక్షేమం, భద్రతా ప్రమాణాలు, గని నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు ఆర్‌జీఓసీ-1 గనికి ఈ అవార్డు లభించింది.కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం దేశంలోని ఉత్తమ గనులను గుర్తించి స్టార్ రేటింగ్ అందిస్తుంది. గని పనితీరు, రక్షణ చర్యలు, నిర్వహణ, పర్యావరణహిత చర్యలు, కార్మిక సంక్షేమం వంటి 84 అంశాలను పరిశీలించి మూల్యాంకనం చేస్తారు. మొత్తం 100 మార్కులకు గాను 91కు పైగా మార్కులు సాధించిన గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్ ప్రదానం చేస్తారు.రామగుండం-3 ఏరియాలోని ఓసి -1 గని ఈ ప్రతిష్టాత్మక అవార్డును సాధించడం ఏరియా అధికారులు, ఉద్యోగులు, కార్మికులకు గర్వకారణంగా నిలిచింది. ఈ గుర్తింపు గని సమిష్టి కృషికి నిదర్శనంగా నిలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *