ఘనంగా బక్రీద్ వేడుకలు

"దౌల్తాబాద్ మండల వ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు"

పయనించే సూర్యుడు మే 29 రాజేష్ దౌల్తాబాద్ ) దౌల్తాబాద్, మండలం పలు గ్రామాలలో పవిత్ర బక్రీద్ పండుగను దౌల్తాబాద్ మండల వ్యాప్తంగా ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరుపుకున్నారు. మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లోని మసీదులు ప్రార్థనలతో మార్మోగాయి. ఉదయం నుంచే కొత్త దుస్తులు ధరించిన ముస్లిం సోదరులు కుటుంబ సభ్యులతో కలిసి మసీదులకు చేరుకుని ప్రత్యేక నమాజ్‌లో పాల్గొన్నారు. దేశ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, సామరస్య వాతావరణం నెలకొనాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నమాజ్ అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. చిన్నారులు, యువకులు, పెద్దలు ఉత్సాహంగా పాల్గొనడంతో పండుగ సందడి నెలకొంది. ముస్లిం పెద్దలు బక్రీద్ పండుగ యొక్క త్యాగం, సేవాభావం, సోదరభావం గొప్పతనాన్ని వివరించారు. పండుగ సందర్భంగా పేదలకు ఆహారం, దుస్తులు పంపిణీ చేసి ముస్లిం సోదరులు తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. పలుచోట్ల ప్రత్యేక విందులు ఏర్పాటు చేసి బంధుమిత్రులు, స్నేహితులతో కలిసి ఆనందంగా గడిపారు. మండలంలోని పలు గ్రామాల్లో బక్రీద్ వేడుకలు ప్రశాంతంగా, సౌహార్ద వాతావరణంలో కొనసాగాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేపట్టి పర్యవేక్షణ నిర్వహించారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన బక్రీద్ వేడుకలు మండలంలో ఆనందోత్సాహాలను నింపాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *