పయనించే సూర్యుడు మే 30 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ శ్రావణ్ కుమార్ గ్రామీణ ప్రాంతాల్లో నీటి వనరుల పరిరక్షణకు ఉపాధి హామీ పథకం పనులు కీలకమని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ పేర్కొన్నారు. శుక్రవారం నాగర్కర్నూల్ నియోజకవర్గ పరిధిలోని బిజినపల్లి మండల కేంద్రంలోని కానుగల కుంట చెరువులో కొనసాగుతున్న పూడికతీత ఉపాధి హామీ పనులను ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా చెరువులో జరుగుతున్న పనుల పురోగతి, పనుల్లో పాల్గొంటున్న కూలీల సంఖ్య, రోజువారీ పనితీరు గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. చెరువు పూడిక తొలగింపు పనులు నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా చేపట్టాలని, పనులను వేగవంతంగా పూర్తి చేసి రైతులకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పనుల్లో పాల్గొంటున్న కూలీలతో కలెక్టర్ మాట్లాడి, ప్రభుత్వం అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకం ద్వారా వారికి కలుగుతున్న ప్రయోజనాలపై ఆరా తీశారు. హాజరవుతున్న ప్రతి కార్మికుడికి సమయానికి వేతనాలు అందేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కూలీలకు తాగునీరు, నీడ, ప్రథమ చికిత్స వంటి కనీస సౌకర్యాలు తప్పనిసరిగా కల్పించాలని సూచించారు. చెరువుల పూడికతీత పనుల వల్ల భూగర్భ జలాల మట్టాలు పెరగడంతో పాటు సాగునీటి నిల్వ సామర్థ్యం మెరుగుపడుతుందని, గ్రామీణాభివృద్ధి మరియు వ్యవసాయాభివృద్ధికి ఉపాధి హామీ పనులు ఎంతో దోహదపడతాయని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా పనులను పారదర్శకంగా నిర్వహించి ప్రజలకు మేలు చేకూర్చాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, ఎంపీడీవో కథలప్ప, డిప్యూటీ ఎమ్మార్వో రవికుమార్, ఏపీవో మల్లికార్జున్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మిద్దె రాములు, ఉపాధి హామీ సిబ్బంది, గ్రామ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.