పెనుగంచిప్రోలులో ప్రైవేట్ పాఠశాలల దందా భద్రత గాలికి, విద్యాశాఖ నిద్రలో

పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం జూన్ 13 పెనుగంచిప్రోలు: పట్టణంలో ప్రైవేట్ పాఠశాలల దందా రోజురోజుకీ శృతిమించుతోంది. విద్య పేరుతో వ్యాపారం చేస్తున్న యాజమాన్యాలు చిన్నారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.స్కూలు బస్సుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. చాలా బస్సులకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ఉందో లేదో కూడా తెలియని పరిస్థితి. సామర్థ్యానికి మించి చిన్న పిల్లల్ని కుక్కి, రోడ్లపై రాష్ డ్రైవింగ్ చేస్తున్న డ్రైవర్లను అడ్డుకునేవారు లేరు. ఉదయం, సాయంత్రం వేళల్లో ఈ బస్సులు చేసే విన్యాసాలు చూస్తే తల్లిదండ్రుల గుండెలు గుబేల్‌మంటున్నాయి.

ఫీజుల దోపిడీ, అధికారుల మౌనం


ఒక్కో విద్యార్థి నుంచి పుస్తకాలు, యూనిఫామ్ పేరుతో వేలకు వేలు వసూలు చేస్తున్నా ప్రశ్నించేవారు లేరు. ఇంత జరుగుతున్నా విద్యాశాఖ అధికారులు మాత్రం కుంభకర్ణ నిద్ర వీడట్లేదు.స్థానికంగా వినిపిస్తున్న మాటేంటంటే: “ప్రతి నెలా స్కూళ్ల నుంచి అధికారులకు ‘మామూళ్లు’ అందుతున్నాయి. అందుకే ఏ ఒక్కరూ తనిఖీలకు రారు, చర్యలు తీసుకోరు” అని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రమాదం జరిగాక వస్తే ఏం లాభం?


గతంలో రాష్ట్రంలోని పలుచోట్ల స్కూల్ బస్సు ప్రమాదాలు జరిగినప్పుడు హడావిడిగా అధికారులు వచ్చి, విచారణ పేరుతో కాలయాపన చేయడం మనం చూశాం. మరి అదే అధికారులు ముందస్తుగా తనిఖీలు చేసి, ఫిట్‌నెస్ లేని బస్సులను సీజ్ చేస్తే ప్రమాదాలను నివారించవచ్చు కదా?ఏదైనా ఘోరం జరిగాక పరిహారం ప్రకటించడానికి, విచారణ కమిటీలు వేయడానికి అధికారులు పరుగులు పెట్టడం మంచిదా? లేక ఆ ఘోరం జరగకుండా ముందే మేల్కొని చర్యలు తీసుకోవడం మంచిదా? దీనికి విద్యాశాఖ, రవాణా శాఖ అధికారులే సమాధానం చెప్పాలి.వెంటనే పెనుగంచిప్రోలులోని అన్ని ప్రైవేట్ స్కూల్ బస్సుల ఫిట్‌నెస్, డ్రైవర్ల లైసెన్స్‌లను తనిఖీ చేయాలి. పరిమితికి మించి పిల్లల్ని ఎక్కించుకునే బస్సులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఫీజుల దోపిడీపై విచారణ జరిపి, నిబంధనలకు విరుద్ధంగా వసూలు చేస్తున్న స్కూళ్ల గుర్తింపు రద్దు చేయాలి.చిన్నారుల భవిష్యత్తు, ప్రాణాలతో ఆటలాడుకుంటున్న యాజమాన్యాలపై, వారికి వత్తాసు పలుకుతున్న అధికారులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. లేదంటే ఏదో ఒకరోజు జరగరాని నష్టం జరిగితే బాధ్యత ఎవరిది?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *