ఇంటర్ విద్యాశాఖలో బదిలీల షెడ్యూల్ ప్రకటించాలి

*ముఖ్యమంత్రికి టీజీజేఎల్‌ఏ-475 వినతిపత్రం

పయనించే సూర్యుడు మే 21 ,(చింతకాని మండలం రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు). చింతకాని : తెలంగాణ రాష్ట్ర ఇంటర్ విద్యాశాఖలో ఉద్యోగులు, అధ్యాపకుల బదిలీలకు సంబంధించిన షెడ్యూల్‌ను వెంటనే ప్రకటించాలని తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ (టీజీ జే ఎల్ ఏ-475) ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి మరియు విద్యాశాఖ అధికారులకు సంఘం తరఫున ఆన్‌లైన్‌లో వినతిపత్రం పంపించినట్లు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కొప్పిశెట్టి సురేష్ తెలిపారు. ప్రభుత్వం ఉద్యోగుల బదిలీలపై నిషేధాన్ని ఎత్తివేస్తూ జారీ చేసిన జీవో నెం.38 ప్రకారం మే 1 నుంచి మే 31 వరకు అన్ని ప్రభుత్వ శాఖల్లో బదిలీలు చేపట్టవచ్చని పేర్కొన్నప్పటికీ, ఇంటర్ విద్యాశాఖలో మాత్రం ఇప్పటివరకు ఎలాంటి షెడ్యూల్ ప్రకటించలేదని సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాశాఖ కార్యదర్శి కార్యాలయం నుంచి మెమో నెం.103/ఎం సి/2026, తేదీ 25-04-2026న బదిలీలపై మార్గదర్శకాలు జారీ చేసినప్పటికీ ఇంటర్ విద్యాశాఖ స్పందించకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంలో శాఖ అధికారులను సంప్రదించినా సరైన స్పందన లభించడం లేదని తెలిపారు. సాంకేతిక సమస్యలు ఉన్నా కనీసం కండిషనల్ ట్రాన్స్‌ఫర్ షెడ్యూల్ ప్రకటించి బదిలీల ప్రక్రియను ప్రారంభించాలని డిమాండ్ చేశారు.అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న 2023 బ్యాచ్ జూనియర్ లెక్చరర్లకు గత 16 సంవత్సరాలుగా బదిలీలు జరగలేదని, దీంతో వారు కుటుంబాలకు దూరంగా ఉంటూ ఆర్థిక, మానసిక, ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. 2023 బ్యాచ్ అధ్యాపకులకు మూడు సంవత్సరాల సర్వీస్ నిబంధనను సడలించి రెండు సంవత్సరాలకు తగ్గించాలని, లేదంటే బదిలీల కటాఫ్ తేదీని మే 3, 2026గా నిర్ణయించాలని కోరారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి సానుకూలంగా స్పందించాలని కోరుతూ విద్యాశాఖ కార్యదర్శి మరియు ఇంటర్ విద్య డైరెక్టర్‌కు కూడా వినతిపత్రాలు పంపినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా అధ్యక్షుడు గుమ్మడి మల్లయ్య, జిల్లా కార్యదర్శి కొండ వినోద్ బాబు, జిల్లా గౌరవ అధ్యక్షుడు కృష్ణార్జున్ రావు, రాష్ట్ర కౌన్సిలర్ కంచర్ల శ్రీకాంత్, గంట కృష్ణ, పి. సత్యనారాయణ, ఏ. తిరుపతిరావు, రాష్ట్ర మహిళా కార్యదర్శి షాహినా బేగం, జిల్లా మహిళా కార్యదర్శులు పద్మ, అరుణ, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పోలూరు మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *