పయనించే సూర్యుడు న్యూస్: పెద్దపల్లి, సెంటినరీ కాలనీ-23 క్రమశిక్షణ, అంకిత భావంతో విధులు నిర్వహించాలని అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా జనరల్ మేనేజర్ కొలిపాక నాగేశ్వరరావు అన్నారు.సింగరేణి వ్యాప్తంగా నిర్వహిస్తునటువంటి మల్టీ డిపార్ట్మెంటల్ సమావేశాలలో భాగంగా ఆర్జీ-3 & ఏ.పీ.ఏ ఏరియా జి.యం. కార్యాలయ ఉద్యోగులకు శుక్రవారం మల్టీ డిపార్ట్మెంటల్ సమావేశం నిర్వహించి సంస్థ స్థితిగతులతో పాటు, ఏరియా ఆర్ధిక పరిస్థితుల పట్ల అవగాహన కల్పించి, ఉద్యోగులకోసం నిర్వహిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు తెలియజేయడం జరిగింది. ఈ సమావేశానికి అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా జనరల్ మేనేజర్ కొలిపాక నాగేశ్వరరావు హాజరై ఉద్యోగులందరికీ దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగులందరూ సమయపాలన పాటిస్తూ, క్రమశిక్షణ, అంకిత భావంతో పని చేసి, పని గంటలను వృధా చేయకుండా విధులు నిర్వహించాలని అన్నారు. జి.యం. కార్యాలయంలో పని చేస్తున్న ఉద్యోగులకు బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకతకు ప్రత్యక్షంగా సంబంధం లేకపోయినా పరోక్షంగా సంబంధం ఉంటుందని, గనుల కార్యకలాపాలకు సంబంధించి దిశా నిర్దేశం జి.యం. కార్యాలయంలోని వివిధ విభాగాల ద్వారా జరుగుతుందని, కావున హోదాకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ బాధ్యతతో కూడిన విధులు నిర్వహించాలని సూచించారు. ప్రతి ఉద్యోగి సక్రమంగా పని చేస్తూ వ్యక్తిగతంగా అభివృద్ధి చెందుతూ, సంస్థ అభివృద్ధికి తోడ్పడాలన్నారు. ఏ ఇతర ప్రభుత్వ సంస్థలో లేని విధంగా సింగరేణి సంస్థలో ఉద్యోగుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, కావున ఉద్యోగులందరూ దీనిని గమనించి, సమిష్టి కృషితో నాణ్యత, ఉత్పత్తి, ఉత్పాదకత పెంచుతూ సంస్థను మరింత ముందుకు తీసుకువెళ్లాలని కోరారు. భవిష్యత్తులో కంపెనీ లక్ష్యాలకు సంబంధించిన కార్యచరణ ప్రణాళికపై అవగాహన కల్పించారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు రూపొందించే ప్రణాళికలకు అనుగుణంగా పని చేసేందుకు సిద్ధంగా ఉండాలని అన్నారు. సంస్థ పై వినియోగదారుడు పెట్టుకున్న నమ్మకాని వమ్ము చేయకుండా చూడటం మనందరి బాధ్యత అని అన్నారు. తదుపరి సంస్థ అభివృద్ధికి సంబంధించి హాజరైన ఉద్యోగుల నుండి సలహాలు, సూచనలు స్వీకరించారు.ఈ కార్యక్రమంలో ఎస్వోటుజియంలు బి.వి.సత్య నారాయణ, బండి సత్య నారాయణ, ఐఈ డిజిఎం బి.టి. మురళీ కృష్ణ, ఫైనాన్స్ డిజియం సి.జె.సురేఖ, పర్సనల్ విభాగాధిపతి బి.సుదర్శనం, డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, డివై పిఎం సునీల్ ప్రసాద్, ఇతర అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.