పయనించే సూర్యుడు, మే 24 (సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండల ప్రతినిధి: స్వాతి, నర్సిములు): జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని పలు ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ స్థానిక శాసనసభ్యుడు కొనింటి మాణిక్ రావు, సంగారెడ్డి శాసనసభ్యుడు చింత ప్రభాకర్, పటాన్‌చెరు శాసనసభ్యుడు గూడెం మహిపాల్ రెడ్డి శనివారం జిల్లా కలెక్టర్‌ను వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న పలు అభివృద్ధి పనులపై కలెక్టర్‌తో వారు సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా నియోజకవర్గంలోని ప్రధాన రహదారులైన జహీరాబాద్ నుండి శేఖపూర్ మీదుగా బోనస్పూర్ వరకు, జహీరాబాద్ నుండి మొగుడంపల్లి మీదుగా గౌసాబాద్ వరకు, జహీరాబాద్ నుండి అల్గోల్ మీదుగా ఎల్గోయ్ వరకు, అలాగే దిగ్వాల్ నుండి ఈదులపల్లి, మెదపల్లి మీదుగా ఝరసంఘం వరకు ఇప్పటికే మంజూరైన రహదారి, భవనాల శాఖ మరియు పంచాయతీ రాజ్ రహదారుల పనులను వెంటనే ప్రారంభించాలని కోరారు. ఈ మార్గాలన్నీ గుంతలమయంగా మారి నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతున్నందున వెంటనే నిధులు విడుదల చేసి మరమ్మతులు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. దీంతో పాటు ఝరాసంఘం మండల కేంద్రంలో విద్యుత్ స్తంభాల తొలగింపు ప్రక్రియను పూర్తి చేసి రహదారి విస్తరణ పనులను వేగవంతం చేయాలని కోరారు. ఇండ్లు లేని నిరుపేద లబ్ధిదారులను నిష్పక్షపాతంగా గుర్తించి వారికి వెంటనే ఇందిరమ్మ ఇండ్లను అందజేయాలని స్పష్టం చేశారు. జహీరాబాద్ పట్టణంలో గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన కూరగాయలు, మాంసాహార సమీకృత విక్రయ శాలను వెంటనే అందుబాటులోకి తెచ్చి, వ్యాపారస్తులకు వారికి కేటాయించిన దుకాణాలను అప్పగించాలని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. వేసవి తీవ్రత దృష్ట్యా గ్రామాల్లో తాగునీటి ఎద్దడి ఎక్కువగా ఉన్నందున ప్రతి గ్రామానికి రెండు చొప్పున, అలాగే జహీరాబాద్, కోహిర్ పురపాలక సంఘాల పరిధిలోని ప్రతి వార్డుకు ఒక కొత్త బోరు బావిని మంజూరు చేసి నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. ఈ సమావేశంలో శాసనసభ్యులతో పాటు జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షుడు తట్టు నారాయణ, మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షుడు సంజీవ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.