మధ్యాహ్న భోజన నిర్వహణలో ఉపాధ్యాయులను బాధ్యులను చేయొద్దు – ప్రత్యేక నిర్వహణ వ్యవస్థ ఏర్పాటు చేయాలి

* ఉపాధ్యాయులకు కూడా టిఫిన్, భోజన నిర్ణయం ఉపసంహరించుకోవాలి... * ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కి ఆర్యుపిపిటిఎస్ జగిత్యాల జిల్లా శాఖ వినతి...

పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ జులై 07 మామిడిపెల్లి లక్ష్మణ్ ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం నిర్వహణలో లోపాలు లేదా ఫుడ్ పాయిజనింగ్ వంటి ఘటనలు జరిగిన సందర్భాల్లో ఉపాధ్యాయులను బాధ్యులను చేస్తూ చర్యలు తీసుకోవాలనే ప్రతిపాదనను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్ జగిత్యాల జిల్లా శాఖ కోరింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి జిల్లా శాఖ తరఫున జిల్లా శాఖ అధ్యక్షులు వేల్పుల స్వామి యాదవ్, జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి ఎనగందుల రాజేంద్రప్రసాద్, జిల్లా శాఖ గౌరవ అధ్యక్షులు అలకట్టు సత్యనారాయణ లు వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఇప్పటికే విద్యాబోధనతో పాటు అనేక పరిపాలనా బాధ్యతలు, ప్రభుత్వ పథకాల అమలు, ఆన్‌లైన్ నివేదికలు, పరీక్షల నిర్వహణ వంటి అనేక విధులు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ, ఆహార నాణ్యత, భద్రతకు సంబంధించిన పూర్తి బాధ్యతలను కూడా వారిపైనే మోపడం సమంజసం కాదని తెలిపారు. వారానికి ఒక రోజు లేదా ఒక పూట తరగతులను వదిలి భోజన పర్యవేక్షణ చేయాల్సి వస్తే విద్యాబోధనకు అంతరాయం ఏర్పడి, సిలబస్ పూర్తి చేయడం కష్టమవుతుందని, దీని ప్రభావం విద్యార్థుల అభ్యాస ప్రమాణాలపై పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజన పథకం నిర్వహణను ప్రత్యేక ఏజెన్సీలకు అప్పగించాలి. ప్రతి పాఠశాలకు ప్రత్యేక మిడ్-డే మీల్ సూపర్వైజర్ లేదా హాస్టల్ వార్డెన్ తరహా సిబ్బందిని నియమించాలి. ఉపాధ్యాయులు కేవలం సాధారణ పర్యవేక్షణ మాత్రమే నిర్వహించేలా స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలి. ఆహార నాణ్యత, పరిశుభ్రత, భద్రతలో లోపాలు జరిగితే సంబంధిత నిర్వహణ సంస్థ లేదా ఏజెన్సీనే బాధ్యులను చేయాలి. ఈ అంశంపై ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి ఆచరణ సాధ్యమైన నిర్ణయం తీసుకోవాలి. మధ్యాహ్న భోజన కార్మికులకు నెలకు రూ.10,000 గౌరవ వేతనం కల్పించాలి. ఒక్కో విద్యార్థికి రూ.15 చొప్పున నిర్వహణ వ్యయం చెల్లిస్తేనే నాణ్యమైన భోజనం అందించగలమని పేర్కొన్నారు. ఉపాధ్యాయులకు కూడా టిఫిన్, భోజనం సంబంధించిన నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని కోరారు. ఉపాధ్యాయులను అదనపు బాధ్యతల నుంచి విముక్తి కల్పించి, విద్యాబోధనపై పూర్తిస్థాయిలో దృష్టి సారించేలా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్ జగిత్యాల జిల్లా శాఖ విజ్ఞప్తి చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *