శాస్త్రీయ యాజమాన్యంతోనే మామిడి దిగుబడులు పెంపు

పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్,జూలై 08 మామిడిపెల్లి లక్ష్మణ్ గత నాలుగేళ్లుగా మామిడి దిగుబడులు తగ్గడంతో రైతులు తోటలను తొలగించే పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఆలూరు గ్రామంలో జిల్లా ఉద్యానవన, పట్టు పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో మామిడి సాగుపై జిల్లా స్థాయి అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన, పట్టు పరిశ్రమల శాఖ అధికారి కట్ట లత మాట్లాడుతూ శాస్త్రీయ పద్ధతులను పాటించడం ద్వారా దిగుబడులు గణనీయంగా పెంచుకోవచ్చని రైతులకు సూచించారు. పంట కోత పూర్తయిన 15 రోజుల తర్వాత నుంచి జూలై నెలాఖరు వరకు కొమ్మల కత్తిరింపులు చేపట్టాలని, తోట మధ్యలో నిలబడినప్పుడు సూర్యరశ్మి 50 శాతం మేర నేలపై పడేలా చెట్లను తీర్చిదిద్దాలని తెలిపారు. కత్తులు, గొడ్డళ్లు కాకుండా రంపంతోనే కత్తిరింపులు చేయాలని, అనంతరం కత్తిరించిన భాగాలపై బోర్డో పేస్ట్ పూయాలని సూచించారు. కాండం పురుగుల నివారణకు లీటరు నీటికి 2 మి.లీ. క్లోరోపైరిఫాస్ కలిపి కాండంపై పిచికారీ చేయాలని తెలిపారు. బిందు సేద్యం ద్వారా నీటి యాజమాన్యం చేపట్టాలని, ప్రతి చెట్టుకు ఒకటి లేదా రెండు డ్రిప్ లైన్లను చెట్టు నుంచి ఐదు అడుగుల దూరంలో ఏర్పాటు చేసి అవసరమైన మేర నీటిని అందించాలని రైతులకు సూచించారు. మామిడి తోటల సంరక్షణ, శాస్త్రీయ సాగు విధానాలు, దిగుబడుల పెంపునకు అనుసరించాల్సిన మెళకువలపై అధికారులు రైతులకు వివరించగా, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొని సందేహాలను నివృత్తి చేసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *