పయనించే సూర్యుడు జులై 5 ఆదోని రూరల్ రిపోర్టర్ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న “ప్రజల కోసం… మీ పార్థసారథి” కార్యక్రమంలో భాగంగా ఆదోని ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి శనివారం ఉదయం పట్టణంలోని మరాఠీగేరిలో పర్యటించారు. మస్తాన్ వలి దర్గా నుంచి ప్రారంభమైన కార్యక్రమంలో ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా స్థానికులు ప్రధానంగా వర్షాకాలంలో ఇళ్లు తక్కువ ఎత్తులో ఉండటంతో వర్షపు నీరు ఇళ్లలోకి చేరి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. అలాగే వంకపై ఉన్న కల్వర్టు వద్ద ప్రమాదాలు జరగకుండా రక్షణ కోసం ప్రహరీ గోడ నిర్మించాలని కోరారు. సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే పరిశీలించి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే సమస్యలను ప్రాధాన్య క్రమంలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వార్డులోని ప్రజలు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. అర్హులైన వారికి ప్రతి నెల పెన్షన్లు సకాలంలో అందుతున్నాయని, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం అభినందనీయమని పేర్కొన్నారు. అలాగే “తల్లి కి వందనం” పథకం ద్వారా ఒకరు, ఇద్దరు, ముగ్గురు పిల్లలు చదువుతున్న కుటుంబాల్లో అర్హులైన ప్రతి విద్యార్థికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించడం వల్ల పిల్లల చదువుకు ఎంతో తోడ్పాటుగా ఉందని తల్లులు హర్షం వ్యక్తం చేస్తూ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న కూటమి ప్రభుత్వానికి, ప్రజల వద్దకే వచ్చి సమస్యలను తెలుసుకుంటున్న ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి కి వారు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ వార్డు ఇన్‌చార్జి రవి, బీజేపీ నాయకులు రమేష్ నాయుడు, మాధవి, టీడీపీ మాజీ కౌన్సిలర్ తాయప్ప, నీలకంఠ, సీసీఐ వెంకటేష్, నాగప్ప, ప్రదీప్, స్థానిక మహిళలు, యువకులు, స్థానికులు పాల్గొన్నారు.