పయనించే సూర్యుడు, జూలై 6 (సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండల ప్రతినిధి: స్వాతి, నర్సిములు): సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని గడి వీధిలో కొలువై ఉన్న శ్రీ ఊరడమ్మ దేవాలయ ప్రాంగణంలో శ్రీ ఊరడమ్మ ప్రసన్న ప్రతిష్ఠ మరియు శిఖర శోభాయమాన భోగలక్ష్మి దేవాలయ గోపుర స్థాపన మహోత్సవాలు ఆదివారం అత్యంత భక్తిశ్రద్ధలతో మరియు వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ ఆధ్యాత్మిక ఉత్సవాల సందర్భంగా ఆలయంలో ఉదయం ఎనిమిది గంటల నుంచే అర్చకుల వేదమంత్రోచ్ఛారణల మధ్య వేదహోమము, స్వస్తి పుణ్యాహవాచనము, మాతృకాపూజ, ఆచార్య ఋత్విక్ వరణము మరియు మండపారాధన కార్యక్రమాలను శాస్త్రోక్తంగా ప్రారంభించారు. అనంతరం దేవతామూర్తుల పరిరక్షణ కొరకు మృత్సంగ్రహణము, అంకురార్పణము, జలాధివాసము, ధాన్యాధివాసము, రత్నాధివాసము, పంచగవ్యాధివాసములతో పాటు ప్రతిష్ఠాంగ హోమములను భక్తుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. మధ్యాహ్నం ఒకటిన్నర గంటల నుండి మూడు గంటల వరకు వేద పండితుల ఆధ్వర్యంలో అత్యంత ప్రధానమైన శిఖర ప్రతిష్ఠ కార్యక్రమమును అత్యంత వేడుకగా పూర్తి చేసి ఆ తర్వాత పూర్ణాహుతి మరియు మహా మంగళహారతి కార్యక్రమాలను భక్తిభావంతో విజయవంతంగా ముగించారు. ఈ ప్రతిష్ఠాపన మహోత్సవాల్లో జహీరాబాద్ పట్టణ మరియు చుట్టుపక్కల ప్రాంతాల నుండి భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఉత్సవాల అనంతరం ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో సమస్త భక్తులకు మరియు ప్రజలకు అన్న మహాప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ఈ కార్యక్రమంలో గడి వీధి ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక భక్తులు మరియు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపాకటాక్షాలు పొందారు.