బూర్గంపహాడ్ తహసీల్దార్ కార్యాలయంలో సిబ్బంది కొరత..

* కుల, ఆదాయ, నివాస ధ్రువపత్రాల కోసం రోజుల తరబడి నిరీక్షణ * తక్షణమే అదనపు సిబ్బందిని నియమించాలని ప్రజల విజ్ఞప్తి

పయనించే సూర్యుడు, జూలై 08, బూర్గంపాడు మండల రిపోర్టర్ పోతుగంటి రామ్ ప్రసాద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల తహసీల్దార్ కార్యాలయంలో సిబ్బంది కొరత కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా కుల ,ఆదాయ , నివాస తదితర ధ్రువపత్రాల కోసం ప్రతిరోజూ వందల సంఖ్యలో ప్రజలు కార్యాలయానికి వస్తున్నప్పటికీ, సిబ్బంది తక్కువగా ఉండటంతో పనులు సకాలంలో పూర్తికావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు విద్యాసంస్థల్లో ప్రవేశాలు, స్కాలర్‌షిప్‌లు, ఉద్యోగ నియామకాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం అవసరమైన ధ్రువపత్రాలు పొందేందుకు కార్యాలయానికి పలుమార్లు రావాల్సి వస్తోందని ప్రజలు చెబుతున్నారు. గ్రామాల నుంచి దూర ప్రాంతాల నుంచి వచ్చే వృద్ధులు, మహిళలు, రైతులు గంటల తరబడి వేచి చూసినా పని పూర్తికాక నిరాశతో వెనుదిరుగుతున్న పరిస్థితి నెలకొంది.ప్రస్తుతం ఉన్న సిబ్బందిపై పనిభారం అధికంగా ఉండటంతో ప్రజలకు వేగంగా సేవలు అందించడం కష్టంగా మారిందని స్థానికులు పేర్కొంటున్నారు. దీనివల్ల దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం జరుగుతుండటంతో ప్రజలకు అదనపు ఖర్చు, సమయ నష్టం కలుగుతోందని వాపోతున్నారు.ప్రజలకు ఇబ్బందులు లేకుండా సేవలు అందించేందుకు బూర్గంపహాడ్ తహసీల్దార్ కార్యాలయంలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేసి, అవసరమైతే అదనపు సిబ్బందిని నియమించాలని మండల ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *