సింగరేణి మండలంలో ఘనంగా బంజారా సీతలా భవాని పండుగ వేడుకలు

తండాల్లో భక్తి సందడి.. సీతలా మాతకు ప్రత్యేక పూజలు

పయనించే సూర్యుడు న్యూస్, జూలై 8, సింగరేణి రిపోర్టర్ నరేష్ సింగరేణి మండలంలోని తండాలు, గ్రామాల్లో బంజారా సమాజ ఆరాధ్య దైవమైన సీతలా భవాని పండుగను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. బంజారా కుటుంబాలు సంప్రదాయ ఆచారాలను పాటిస్తూ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించారు. తండాలన్నీ పండుగ శోభతో కళకళలాడగా మహిళలు, యువతులు సంప్రదాయ బంజారా వేషధారణలో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
సీతలా భవాని పండుగ బంజారా సంస్కృతి, సంప్రదాయాలు, ఐక్యత, భక్తి మరియు ప్రకృతి పట్ల గౌరవానికి ప్రతీకగా భావిస్తారు. తరతరాలుగా కొనసాగుతున్న ఈ పవిత్ర సంప్రదాయాన్ని బంజారా ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, కుటుంబ సభ్యులు, పశుసంపద, పంటలు సుభిక్షంగా ఉం డాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పండుగ సందర్భంగా తండాల్లో భక్తి గీతాలు, సంప్రదాయ నృత్యాలు, సామూహిక ప్రార్థనలు నిర్వహించి సీతలా భవాని అమ్మవారి ఆశీస్సులు కోరుకున్నారు. ఈ పండుగ పరస్పర ప్రేమ, సహకారం, సామరస్యం మరియు బంజారా సంస్కృతి పరిరక్షణకు ప్రతీకగా నిలుస్తుందని పెద్దలు పేర్కొన్నారు. సీతలా భవాని అమ్మవారి కరుణాకటాక్షాలతో ప్రతి కుటుంబం సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని, ప్రతి తండా అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని భక్తులు ఆకాంక్షించారు. సింగరేణి మండల వ్యాప్తంగా సీతలా భవాని పండుగ వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో, ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *