
పయనించే సూర్యుడు :నవంబర్ /03:నియోజకవర్గం స్టాప్ ప్రతినిధి :సాయిరెడ్డి బొల్లం :మానకొండూర్ నియోజకవర్గం అన్ని మండలం లోని ర్తెతుల అందరికి ఎమ్మెల్యే డా. కవ్వంపెల్లి సత్యనారాయణ మాట్లాడుతూ…బంగాళాఖాతంలో ఏర్పడిన మురాసు తుఫాను నేపథ్యంలో రైతులు పంట నష్టపోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని మానకొండూర్ ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ సూచించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం వరి కోతలు, ధాన్యం నూర్పిళ్లు కొనసాగుతున్న నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. కోసిన వరి పంటను పొలాల్లోనే వదిలేయకుండా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవకుండా టార్పాలిన్లు, కవర్లను అందుబాటులో ఉంచుకోవాలని, కల్లాల్లో, రహదారుల పక్కన ఆరబెట్టిన ధాన్యాన్ని వర్షం నుంచి కాపాడేందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని పేర్కొన్నారు. ధాన్యం నిల్వ కేంద్రాలు, కొనుగోలు కేంద్రాల వద్ద ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రతి గ్రామంలోనూ వాతావరణ పరిస్థితులపై రైతులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని, ఈ దిశగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండి రైతులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. వ్యవసాయ మార్కెట్ కమిటీలు, పీఏసీఎస్ పాలకవర్గాలు సమన్వయంతో పనిచేస్తూ రైతులకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని కోరారు. సర్పంచులు, ఉప సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సైతం రైతులకు అండగా నిలిచి, ధాన్యం తడవకుండా అవసరమైన రక్షణ చర్యలు చేపట్టడంలో తమ వంతు సహకారం అందించాలని డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు.