
పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ తేదీ 3 అరకులోయ రూలర్ పత్రిక ప్రతినిధి అల్లూరి సీతారామ జిల్లా అరకులోయ మండలం లోతేరు పంచాయతీలో సీపీఎం ఎంపీటీసీ అభ్యర్థి కిల్లో రామన్న ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. సుమారు 95 శాతం పీవీటీజీ గిరిజనులు నివసించే ఈ పంచాయతీలో ఉన్నత విద్యావంతుడైన కిల్లో రామన్న సీపీఎం అభ్యర్థిగా బరిలో నిలవడంతో గ్రామాల్లో ప్రచారానికి మంచి ఆదరణ లభిస్తోంది. ఇటీవల కాలంలో హైడ్రో పవర్ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా సాగుతున్న పోరాటంలో ముందుండి ప్రజలతో కలిసి ఉద్యమించడం, అక్రమ మైనింగ్‌కు వ్యతిరేకంగా గళమెత్తడం, పంచాయతీలో నెలకొన్న సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చి వాటి పరిష్కారం కోసం నిరంతరం కృషి చేయడం రామన్నకు ప్రజల్లో గుర్తింపు తీసుకొచ్చాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా పీవీటీజీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా స్థానిక ప్రజల సమస్యలపై అవగాహన కలిగి ఉండటం ఆయనకు అదనపు బలంగా నిలుస్తోందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో శనివారం సీపీఎం జెడ్పీటీసీ అభ్యర్థి గెమ్మెలి చిన్నబాబు, జిల్లా నాయకుడు పొద్దు బాలదేవ్, ఎంపీటీసీ అభ్యర్థి కిల్లో రామన్నతో కలిసి లోతేరు పంచాయతీలోని పలు గ్రామాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాగువలస, తొరడంవలస గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకుంటూ సీపీఎం అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడే సీపీఎం అభ్యర్థులను ఆదరించి గెలిపించాలని పిలుపునిచ్చారు. గిరిజనుల హక్కులు, ఐదో షెడ్యూల్ ప్రాంత చట్టాల పరిరక్షణతో పాటు హైడ్రో పవర్ ప్రాజెక్టుల రద్దు, అక్రమ మైనింగ్ నియంత్రణ, గ్రామీణ మౌలిక సదుపాయాల కల్పన కోసం సీపీఎం నిరంతరం ప్రజల పక్షాన పోరాటం చేస్తుందని తెలిపారు.