
పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం జులై 4 జగయ్యపేట్ట మండలం వేదాద్రి గ్రామంలోని వేదాద్రి–కంచెల ఎత్తిపోతల పథకంలో ఎంపీ లాడ్స్ నిధులు రూ.33 లక్షలతో ఏర్పాటు చేసిన ఒక పంపును ప్రారంభించడంతో పాటు, రాష్ట్ర ప్రభుత్వ నిధులు రూ.15 కోట్లతో చేపట్టనున్న పునరుద్ధరణ పనులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డా. నిమ్మల రామానాయుడు ఘనంగా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని), జగ్గయ్యపేట శాసనసభ్యులు & తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య), ప్రభుత్వ విప్ & నందిగామ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య, ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గద్దె అనురాధతో పాటు ఇరిగేషన్ సలహాదారులు వెంకటేశ్వరరావు, ఐడీసీ ఎండీ.తిరుమల రావు తో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా జలవనరుల శాఖ మంత్రి డా. నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాల్లోని 17,366 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే అత్యంత కీలకమైన పథకం వేదాద్రి–కంచెల ఎత్తిపోతల పథకమని తెలిపారు. 2014–19లో తెలుగుదేశం ప్రభుత్వం ఈ పథకం నిర్వహణ కోసం రూ.5.36 కోట్లు ఖర్చు చేసి రైతులకు సాగునీరు అందించిందన్నారు. అనంతరం గత ప్రభుత్వం నిర్వహణకు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకపోవడంతో 2021 నుంచి ఈ పథకం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని విమర్శించారు. రాష్ట్రంలో ఉన్న 1,023 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీముల్లో కేవలం 166 మాత్రమే పనిచేసే పరిస్థితి గత పాలనలో ఏర్పడిందని, ఐదేళ్లపాటు మరమ్మతులు చేయకపోవడంతో లక్షలాది ఎకరాల ఆయకట్టు సాగునీటికి దూరమైందని అన్నారు. లిఫ్ట్ ఇరిగేషన్ కింద ఉన్న 8.2 లక్షల ఎకరాల్లో దాదాపు 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందని పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్రంలోని లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల మరమ్మతులు, పది సంవత్సరాల నిర్వహణను దృష్టిలో ఉంచుకుని రూ.4,500 కోట్లతో టెండర్లు పిలుస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో నిర్వహణకు రూ.200 కోట్లు మాత్రమే ఖర్చు చేయగా, కూటమి ప్రభుత్వం రెండేళ్లలోనే రూ.1,200 కోట్లు వెచ్చించిందన్నారు. 2027 ఖరీఫ్ నాటికి వేదాద్రి–కంచెల పథకం పునరుద్ధరణ పూర్తిచేసి రైతులకు శాశ్వత సాగునీటి భద్రత కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
.
విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) మాట్లాడుతూ
వేదాద్రి–కంచెల ఎత్తిపోతల పథకం పునరుద్ధరణ రైతులకు శుభదినమని పేర్కొన్నారు. ఈ పథకం కోసం ముఖ్యమంత్రి, జలవనరుల శాఖ మంత్రిని పలుమార్లు కలిసి సమస్యను వివరించామని చెప్పారు. ఎమ్మెల్యేలు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య), తంగిరాల సౌమ్యతో కలిసి ఎంపీ నిధుల నుంచి రూ.33 లక్షలు కేటాయించి పంపు ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. త్వరలో పోలంపల్లి ప్రాజెక్టు పనులు ప్రారంభమవుతాయని, నందిగామలో ఆయుష్ ఆసుపత్రికి శంకుస్థాపన చేయనున్నామని తెలిపారు. జగ్గయ్యపేట–నందిగామ ప్రాంతాలకు కొత్త పరిశ్రమలు రానున్నాయని, ఈ ప్రాంత అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. వేదాద్రి–కంచెల పథకానికి రూ.15 కోట్లు మంజూరు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలిపారు.
.
జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) మాట్లాడుతూ
కంచెల–వేదాద్రి ఎత్తిపోతల పథకం జగ్గయ్యపేట రైతుల చిరకాల స్వప్నమని అన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే వేలాది ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు రైతుల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని చెప్పారు. పోలంపల్లి ప్రాజెక్టు కూడా ఈ ప్రాంత వ్యవసాయాభివృద్ధికి అత్యంత కీలకమని పేర్కొంటూ, అది పూర్తయితే అనేక గ్రామాలకు సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు. రైతులు వర్షాధార సాగుపై ఆధారపడాల్సిన పరిస్థితి తగ్గుతుందని, ప్రాజెక్టు పెండింగ్ పనులను వేగవంతం చేసి రైతుల కలను సాకారం చేస్తామని చెప్పారు. జగ్గయ్యపేట నియోజకవర్గానికి అవసరమైన ప్రతి సాగునీటి ప్రాజెక్టును ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిధులు సాధించి నిర్ణీత గడువులో పూర్తయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కంచెల–వేదాద్రి, పోలంపల్లి వంటి ప్రాజెక్టులు పూర్తయితే భూగర్భ జలాలు పెరిగి వ్యవసాయ ఉత్పత్తి, రైతుల ఆదాయం గణనీయంగా పెరుగుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమం, సాగునీటి ప్రాజెక్టుల పూర్తి, గ్రామీణాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.
.
ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ
వేదాద్రి–కంచెల ఎత్తిపోతల పథకం రైతులకు ఎంతో కీలకమని, ప్రభుత్వాలు మారిన ప్రతిసారి ఈ పథకం నిర్లక్ష్యానికి గురికావడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఈ పథకాన్ని పునరుద్ధరించి రైతులకు అందుబాటులోకి తీసుకువచ్చిందని, అనంతరం వచ్చిన ప్రభుత్వం దానిని పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో మోటార్లు, షట్టర్లు దెబ్బతిన్నాయని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తాను, ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య , ఎంపీ కేశినేని శివనాథ్ కలిసి ఈ పథకం పునరుద్ధరణ కోసం నిరంతరం కృషి చేశామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి సమస్యను తీసుకెళ్లడంతో ప్రభుత్వం రూ.15 కోట్లను మంజూరు చేసిందని చెప్పారు. ఒక పంపు పునరుద్ధరణ కోసం రూ.33 లక్షలు కేటాయించిన ఎంపీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.గత ఐదేళ్లుగా రైతులు ఎదుర్కొన్న కష్టాలకు ఇక ముగింపు పలుకుతూ ఈ పథకం త్వరలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని, రైతుల కళ్లలో ఆనందం నింపే విధంగా పనిచేస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, కూటమి పార్టీ నాయకులు, రైతులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
.

