ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పీఆర్‌టీయూ నిరంతర కృషి– జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు ఆర్. బ్రహ్మారెడ్డి

పయనించే సూర్యుడు జులై 04, (చింతకాని మండలం రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు). చింతకాని : చింతకాని మండలంలో పీఆర్‌టీయూ ఆధ్వర్యంలో 2026 సభ్యత్వ నమోదు, జనరల్ ఫండ్ క్యాంపెయిన్ రెండో రోజు కార్యక్రమం మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో శుక్రవారం నిర్వహించారు. కొదుమూరు, లచ్చగూడెం, నరసింహపురం, చింతకాని, జగన్నాధపురం, రామకృష్ణాపురం తదితర పాఠశాలల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతంగా సాగిందని మండల శాఖ అధ్యక్షుడు ఎన్. విజయభాస్కర్, ప్రధాన కార్యదర్శి బి. ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పీఆర్‌టీయూ జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు ఆర్. బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ విద్యారంగంలో సంస్కరణల పేరుతో చేపడుతున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు, పాఠశాలల పునర్వ్యవస్థీకరణ వంటి చర్యలు ప్రభుత్వ పాఠశాలల మనుగడకు ఎలాంటి నష్టం కలగకుండా, విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని అమలు చేయాలని సూచించారు. విద్యా సంస్కరణల రూపకల్పనలో మేధావులు, విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధుల అభిప్రాయాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యంగా ప్రతి ఉపాధ్యాయుడు బాధ్యతాయుతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యల పరిష్కారానికి పీఆర్‌టీయూ నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్న ఆయన, పీఆర్‌సీ అమలు, పెండింగ్ డీఏల విడుదల, సీపీఎస్ రద్దు వంటి హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా బాధ్యులు టి. సుదర్శన్, మండల బాధ్యులు ఎస్.కె. సోనిమియా, వీరభద్రం, రమేష్, జి. కృష్ణారావు, టి. కృష్ణారావు, బి. వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *