జహీరాబాద్‌లో పూర్తి స్థాయి ఈఎస్ఐ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలి

పయనించే సూర్యుడు, జూలై 10 (సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండల ప్రతినిధి: స్వాతి, నర్సిములు): జహీరాబాద్ నియోజకవర్గంలో కార్మికుల సంక్షేమం కోసం పూర్తి స్థాయి ఈఎస్ఐ ఆసుపత్రిని తక్షణమే ఏర్పాటు చేయాలని కోరుతూ జహీరాబాద్ నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షుర అస్మా తబస్సుమ్ గురువారం హైదరాబాద్ లో రాష్ట్ర కార్మిక ఉపాధి శిక్షణ మరియు కర్మాగారాల శాఖ మంత్రి వివేక్ వెంకట్ స్వామికి ప్రత్యేక వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అనేక పెద్ద కర్మాగారాలు మరియు వేలాది మంది కార్మికులతో జహీరాబాద్ ప్రాంతం చాలా వేగంగా పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చెందుతోందని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం జహీరాబాద్ లో కేవలం ఒక ఈఎస్ఐ డిస్పెన్సరీ మాత్రమే ఉన్నప్పటికీ అది కూడా పూర్తి స్థాయిలో పని చేయని స్థితిలో ఉందని దీనివల్ల స్థానిక పారిశ్రామిక కార్మికులు మరియు వారి కుటుంబ సభ్యులు అత్యవసర వైద్య సేవలు పొందడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వినతి పత్రంలో పేర్కొన్నారు. పారిశ్రామిక కార్మికులు వారి కుటుంబాలు మరియు నియోజకవర్గంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజల ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా జహీరాబాద్ లో అధునాతన ఈఎస్ఐ ఆసుపత్రిని మంజూరు చేయడానికి ప్రభుత్వం నుండి తక్షణ చర్యలు తీసుకోవాలని మంత్రి వివేక్ వెంకట్ స్వామిని కోరారు. దీనిపై స్పందించిన మంత్రి వివేక్ వెంకట్ స్వామి ఈ సమస్యను సానుకూలంగా పరిశీలించి త్వరలోనే తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *