తహసిల్దార్ కార్యాలయం ముట్టడించిన గిరిజన రైతులు.

హామీలు నెరవేర్చాలి.. లేకపోతే ఉద్యమం ఉధృతం: భూఖ్య వీరభద్రం.

పయనించే సూర్యుడు జూన్ 16 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ఏన్కూరు మండలంలో పోడు రైతుల సమస్యలు తీవ్ర రూపం దాల్చింది. పంట రుణాలను వెంటనే మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ గిరిజన సంఘం ఆధ్వర్యంలో సోమవారం తహసిల్దార్ కార్యాలయం ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. మూల పోచారం, రంగాపురం, నెమలిపురి, రామ్‌నగర్ తండా గ్రామాలకు చెందిన వందలాది మంది గిరిజన రైతులు పెద్ద ఎత్తున తరలి వచ్చి కార్యాలయాన్ని ముట్టడి చేసి ఆందోళన చేపట్టారు. సమస్యపై స్పష్టమైన హామీ ఇచ్చే వరకు అక్కడి నుంచి కదిలేది లేదని బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు పంట రుణాలు మాఫీ చేయాలి,గిరిజన రైతులకు న్యాయం చేయాలి అంటూ నినాదాలు చేశారు. జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీవో తక్షణమే జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమానికి హాజరైన సిపిఎం వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం మాట్లాడుతూ, గత ప్రభుత్వ కాలంలో హక్కు పత్రాల ఆధారంగా తీసుకున్న పంట రుణాలను ఇప్పటికీ మాఫీ చేయకుండా బ్యాంకు అధికారులు బలవంతంగా వసూళ్లు జరుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. గిరిజన రైతులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే రుణమాఫీ చేసి కొత్త పంట రుణాలు అందించకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసిల్దార్ సిహెచ్ శేషగిరిరావుకు సమర్పించారు. గిరిజన రైతుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు సిపిఐ(ఎం) పార్టీ ఆధ్వర్యంలో నిరంతర పోరాటం కొనసాగుతుందని నాయకులు స్పష్టం చేశారు. ఈ ధర్నాలో గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు బానోత్ బాలాజీ, సిపిఎం మండల కార్యదర్శి దొంతబోయిన నాగేశ్వరరావు, సిఐటియు మండల కార్యదర్శి ఏర్పుల రాములు, ఇటికాల లెనిన్, భూక్య లక్ష్మ, కలసాని సాయి తదితరులు పాల్గొని రైతులకు మద్దతు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *