పయనించే సూర్యుడు న్యూస్ జూలై 10 సింగరేణి రిపోర్టర్ నరేష్ భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా గురువారం పోలంపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని పోలంపల్లి తండాలో ఓటర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బద్రునాయక్ పాల్గొని గ్రామ ప్రజలకు ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై విస్తృతంగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా బద్రునాయక్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి అర్హత కలిగిన పౌరుడు తన ఓటు హక్కును కాపాడుకోవడం బాధ్యతగా భావించాలని అన్నారు. ఓటర్ల జాబితాలో పేరు నమోదు, సవరణ లేదా మార్పులకు సంబంధించి అవసరమైన దరఖాస్తులు, ధ్రువపత్రాలను బూత్ స్థాయి అధికారికి తప్పనిసరిగా సమర్పించాలని సూచించారు. 2002 సంవత్సరంలో లేదా అంతకుముందు ఓటు హక్కుకు అర్హత పొందిన వారు ప్రత్యేక సవరణ దరఖాస్తులో మొదటి భాగం, మూడవ భాగం పూర్తి చేసి సమర్పించాలని తెలిపారు. అలాగే ఇప్పటివరకు ఓటర్ల జాబితాలో పేరు నమోదు కాని అర్హులైన వారు రెండవ భాగం, మూడవ భాగం పూర్తి చేసి సంబంధిత అధికారులకు అందజేయాలని వివరించారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన గడువులోగా అవసరమైన పత్రాలను సమర్పించి ప్రతి అర్హుడూ తన ఓటు హక్కును భద్రపరుచుకోవాలని, ప్రత్యేక ఓటర్ల సవరణ కార్యక్రమాన్ని ప్రజలు పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు రమేష్, సంపత్, లావణ్య, బూత్ స్థాయి అధికారి వినాయక్, భద్య, భౌసింగ్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై వివరాలు తెలుసుకొని తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.