పయనించే సూర్యుడు రిపోర్టర్ ఎరుకుల మహేష్) ఆదోని మండలం పెద్దహరివాణం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న పి. హసీనా కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ నిర్వహించే ప్రతిష్టాత్మక ప్రేరణ కార్యక్రమానికి ఎంపికైంది.ఈ ఏడాది ఫిబ్రవరి 10న కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం బనవాసిలోని నవోదయ విద్యాలయంలో నిర్వహించిన వ్యాసరచన పోటీ, ముఖాముఖి పరీక్షలో పాల్గొని ప్రతిభ కనబరిచి ఎంపికైంది.ఎంపికైన విద్యార్థిని ఆగస్టు 23 నుంచి 29 వరకు గుజరాత్ రాష్ట్రంలోని వాద్‌నగర్‌లో జరిగే వారం రోజుల ప్రేరణ కార్యక్రమంలో పాల్గొననుంది.ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు భారతీయ సాంకేతిక విద్యాసంస్థ గాంధీనగర్ రూపొందించిన ప్రత్యేక పాఠ్యాంశాల ఆధారంగా విజ్ఞాన ప్రయోగాలు, సంస్కృతి, వారసత్వం, సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలు, ఆత్మగౌరవం, కరుణ, సేవాభావం, దేశభక్తి, యోగ తదితర అంశాలపై శిక్షణ అందించనున్నారు.విద్యార్థిని ఎంపిక కావడం పట్ల పాఠశాల ఉపాధ్యాయులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సైన్స్ ఉపాధ్యాయులు చిరంజీవి, పుష్పలత, రవి కుమార్, నవీన్ కుమార్, చిత్రలేఖన ఉపాధ్యాయుడు వెంకటేశ్, వ్యాయామ ఉపాధ్యాయుడు రామన్న విద్యార్థినిని అభినందించారు.